సాంస్కృతిక సామరస్యానికి అంకితమైన ఒక ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ అయిన స్టిచింగ్ వసుధైవ కుటుంబకం (SVK), శ్రీ అన్నమాచార్యుల జీవితాన్ని, కాలాతీత వారసత్వాన్ని సంగీత ప్రతిభను ఘనంగా స్మరించుకుంది. మే 23న, ఆ సంగీత విద్వాంసుని 618వ జయంతి సందర్భంగా, SVK ఐండ్‌హోవెన్‌లో ఒక మహత్తరమైన శ్రీ అన్నమాచార్య ఆరాధనను నిర్వహించింది.
ఈ సాంస్కృతిక మైలురాయి, పశ్చిమ ఐరోపా నలుమూలల నుంచి ఎన్నో ప్రఖ్యాత సంగీత, నృత్య పాఠశాలలను ఒకచోట చేర్చి, శ్రీ అన్నమాచార్యులువారికి కళ, సంగీతం, ప్రగాఢ భక్తితో కూడిన సామూహిక నివాళిని అర్పించింది. ఈ కార్యక్రమంలో 170 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అంతేగాదు 75 ఏళ్ల వయసు ఉన్న అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు, చిన్న పిల్లలు కూడా అన్నమాచార్యుల వారి క్లిష్టమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలను, సంకీర్తనలను అలవోకగా పఠించడం, ప్రదర్శించడం చూడటం ప్రాచీన సంప్రదాయ పరిరక్షణకు ఒక నిదర్శనంగా నిలిచింది.

తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహకరమైన మద్దతుతో మంత్రముగ్ధులైన ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ, గొప్ప వారసత్వాన్ని తర్వాతి తరానికి ఎలా విజయవంతంగా అందించవచ్చో కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఐండ్‌హోవెన్ నగర కౌన్సిలర్లు మిరియం ఫ్రోసీ, చైతాలి సేన్‌గుప్తాతో పాటు సంస్కృతి అండ్ సంస్కార్ సంస్థ అధిపతి వల్లభ్ పాండే, హెచ్‌ఎస్‌ఎస్ ఐండ్‌హోవెన్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి వారిలో ఉన్నారు.
అతిథులందరూ యువ కళాకారులను ఆశీర్వదించి.. వారి అసాధారణ క్రమశిక్షణను ప్రశంసించారు. శాస్త్రీయ కళల పట్ల వారి అంకితభావాన్ని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. అన్నమాచార్యుల చారిత్రక పాత్రకు తగిన నివాళిగా.. సుందరంగా అలంకరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాల పవిత్ర వాతావరణంలో ఈ కళా ప్రదర్శనలు జరిగాయి.
(చదవండి: సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్)


