
నిమిషా ప్రియ(ఎడమ), మృతుడు తలాబ్(కుడి)
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.
నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్‌లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్‌మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.
కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్‌లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం.
మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్‌తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.
2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్‌లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

భర్తతో నిమిష
ఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్‌మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి.
