
- భారతీయ విద్యార్థిపై అమెరికా పోలీసుల కర్కశత్వం
- బలవంతంగా దేశ బహిష్కరణ
- వెలుగులోకి నెవార్క్ ఎయిర్‌పోర్ట్ ఘటన ఫొటోలు, వీడియోలు
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కార్ కర్కశ వైఖరి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యవహారం ఆలస్యంగా మీడియాకు బహిర్గతమైంది. విద్యార్థిని నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి, దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
విద్యాభ్యాసం కోసం తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఒక ప్రవాసభారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక భారతీయ యువకుడిని నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు.
నేనే తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కిందపడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. ‘‘ నేరస్తుడిలా సంకెళ్లు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలివేసింది. కలలను నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చిఉంటాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టకపోయినా ఇలా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూస్తూకూడా నేను నిస్సహాయుడినైపోయా. నా హృదయం ముక్కలైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను ఇలా బలవంతంగా పంపేయడం నిజంగా పెద్ద విషాదం. ఆ అబ్బాయి హరియాణా యాస అయిన హర్‌యాణ్వీలో మాట్లాడుతున్నాడు. ‘‘నాకేం పిచ్చిలేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడిని అని అందర్నీ న మ్మించేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ విద్యార్థి అరవడం ఆ వీడియోలో కనిపించింది.
Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu
— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025
ఇండియన్ ఎంబసీ ఆదుకోవాలి
‘‘ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది’’ అని జైన్ రాసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విదేశీ విద్యార్థుల వీసా గడువును ముగించేసి వాళ్లను బలవంతంగా దేశబహిష్కరణ చేస్తున్న వేళ తాజాగా ఈ ఘటన జరగడం గమనార్హం. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ విద్యార్థులను గుర్తించి గెంటేస్తున్న ఉదంతాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువయ్యాయి.