
డాలస్, టెక్సస్: ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత బుర్రా సాయిమాదవ్ తో డాలస్‌లో సాహితీ ప్రియుల సమక్షంలో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా.. ఉల్లాసభరితంగా జరిగింది. రంగస్థల నటునిగా, నాటక రచయితగా, టి.వి ధారావాహికల రచయిత ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఇప్పుడు ఒక ప్రసిద్ధ సినిమా మాటల రచయితగా, సంభాషణల రచయితగా సినీమా పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందే స్థాయికి చేరడంలో చేసిన కృషి వెనుక ఉన్న నేపధ్యాన్ని, సాహితీ ప్రియులు అడిగిన అనేక ప్రశ్నలకు సాయిమాధవ్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు.
‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో సినీ సంభాషణల రచయితగా సినీ రంగానికి పరిచయమవడం, తాను మాటలు రాసిన “కంచె”, “మహానటి” రెండు సినిమాలు భారత ప్రభుత్వముచే ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ పురస్కారాలు అందుకోవడం, “మళ్లీ మళ్లీ ఇది రానిరోజు” సినిమాకు ఉత్తమ మాటలర చయితగా నంది పురస్కారం, ”పుత్తడిబొమ్మ”, “సీతామహాలక్ష్మి” ధారావాహికలకు ఉత్తమ రచయితగా నంది పురస్కారాలు అందుకోవడం తన రచనా జీవితంలో కొన్ని మైలురాళ్ళు మాత్రమేనని, ఇంకా ఎంతో సాధించ వలసినది ఉంది అన్నారు.
‘కృష్ణం వందే జగద్గురుం”, “గోపాల గోపాల”, “కంచె”, “సర్దార్ గబ్బర్ సింగ్”, “గౌతమీపుత్ర శాతకర్ణి”, “మహానటి”, “ఖైదీ 150” లాంటి పలు సినిమాలలో తాను వ్రాసిన మాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ తనకు ఎంతో సంతృప్తిని, బలాన్ని ఇచ్చిందని ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, నటులకు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములు” అన్నారు బుర్రా సాయిమాధవ్. తాను ఏమి వ్రాసినా సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రచనలు చేస్తానని, సమాజానికి హానికల్గించే మాటలు తనను ఎంత ప్రలోభపెట్టినా తన కలంనుండి వెలువడవని అందరి హర్షద్వానాల మధ్య సాయిమాధవ్ వెల్లడించారు.
తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఆహూతులందరితో కలసి బుర్రా సాయిమాధవ్ ని దుశ్శాలువ, సన్మాన జ్ఞాపికతో ఘనంగా సత్కరించి మాట్లాడుతూ – “సినీరంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, తాను వచ్చిన నాటక రంగాన్ని విస్మరించకుండా, ‘కళల కాణాచి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, రంగస్థల కళాభివృద్ధికోసం లక్షలాది రూపాయల తన స్వంత నిధులను సైతం వెచ్చిస్తూ, ఎన్నో సంవత్సరాలగా సాయిమాధవ్ చేస్తున్న కృషి ఎంతైనా అభినందించదగ్గది, ఇతరులకు ఆదర్శప్రాయమైనది అన్నారు.”
ఇదే సభలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడు చేంబోలు శ్రీరామశాస్త్రి వ్రాసిన “సిరివెన్నెల తొలి గురువు ‘సమ్మాన్యుడు’ కొత్తగా” అనే పుస్తకాన్ని డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించి తొలిప్రతిని బుర్రా సాయిమాధవ్‌కు అందజేశారు. “టి.వి, సినీ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన కళాకారులకు ఎన్నో సంవత్సరాలగా సంప్రదాయంగా ఇస్తున్న నంది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేయడం శోచనీయమని, వెంటనే వాటిని పునరుద్దరించి ఆ రంగాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు” డా. ప్రసాద్ తోటకూర
బుర్రా సాయిమాదవ్ తనకు ఈ ఆత్మీయసమావేశం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఒక ప్రక్క ఎన్నో సంవత్సరాలగా తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం కృషి చేస్తూ, మరో ప్రక్క సామాజికసేవలో ముందుంటున్న మిత్రులు డా. ప్రసాద్ తోటకూర ఈ అభినందన సభను ఏర్పాటుచేసి, చక్కగా సభా సమన్వం చేసినందులకు వారికి, వారి మిత్రబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
ఆద్యంతం ఉత్సాహంగాజరిగిన ఈ సాహితీ సమావేశంలో సత్యన్ కళ్యాణ్ దుర్గ్, రవీంద్ర పాపినేని, సాయి సత్యనారాయణ, రాజా రెడ్డి, మురళి వెన్నం, సిద్ధూ, రమేశ్ ప్రేమ్ కుమార్, శివకుమారి, గాయకులు గని మరియు వారి కుటుంబసభ్యులు, యాజీ జయంతి, చినసత్యం వీర్నపు, ప్రశాంతి హారతి, చంద్రహాస్ మద్దుకూరి, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రాంకీ చేబ్రోలు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, ఇక్బాల్, శ్రీనివాస్, డా. ఇస్మాయిల్ పెనుగొండ, దయాకర్ మాడ, డా. జగదీశ్వరన్ పూదూర్, చంద్రశేఖర్ లంక, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, మడిశెట్టి గోపాల్, సతీష్ బండారు తదితరులు ఈ ముఖా ముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.