
ఆగస్టు 23 శనివారం నాడు సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించబడింది. మెల్బోర్న్ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారిచే చేయబడిన ఈ అవధాన కార్యక్రమానికి సాహిత్యరత్న శ్రీ తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకులుగా నిర్వహించారు.
సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో 3 గంటలకు పైగా ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం నాలుగు ఆవృత్తులతో (రౌండ్స్), 20 మంది పృచ్ఛకులతో, ఉన్నత సాహిత్యప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు శ్రీమతి సంధ్యారెడ్డిగారు అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించగలమని తెలిపారు. తదుపరి 11 వత్సరాల చిరంజీవి కృష్ణ సుహాస్ తటవర్తి అనర్గళంగా చెప్పిన గజేంద్రమోక్షం కథ సభా సదుల మనసుల రంజింప చేసినది. 30 ఆగస్టు శనివారం నాడు మెల్బోర్న్ నగరంలో కూడా శ్రీ కళ్యాణ చక్రవర్తి గారి చేతనే మరొక అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనరంజని కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత సీతంరాజు తెలిపారు.