
టంపా: ఫ్లోరిడా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని ఆయన అభినందించారు. అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానన్నారు.
హంసవింశతి పుస్తకం ఆవిష్కరణ
18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణ రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు.

పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్‌సైక్లోపీడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు. 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.