డొంకేశ్వర్(ఆర్మూర్) : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం (వీబీజీరామ్‌జీ) పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. ప్రస్తుత వేసవి కాలంలో కూలీలకు చేతినిండా పని, కడుపునిండా ఉపాధిని అందిస్తోంది. ప్రభుత్వం రోజువారీ కూలి రూ.300లకు పెంచడంతో జిల్లాలో ఉపాధి హాజరు గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూలీలు ఉత్సాహంగా పనులకు తరలివస్తున్నారు. వారానికి రూ.2 వేల వరకు వేతనం నేరుగా చేతికి అందుతుండడంతో పేద కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాలో 545 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు చెరువుల వద్ద జరుగుతున్నాయి. గుంతలు తవ్వించడం వలన చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే, 45 రోజుల క్రితం 30 వేల మంది కూడా రాని కూలీలు ఇప్పుడు 75 వేల నుంచి 76 వేల వరకు వస్తున్నారు. ఎండలు ముదురుతున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున కూలీలు పనులకు రావడం గమనార్హం. సకాలంలో కూలి డబ్బులు వస్తుండడంతో కూలీల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నెలకొంది. కూలీలకు పని కల్పించడంతో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో ఉందని, హాజరును మరింత పెంచి పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని డీఆర్డీవో సాయన్న వెల్లడించారు.
పెరిగిన రూ.300 వేతనంతో
జిల్లాలో ఉపాధి జాతర
నిత్యం 75 వేలు దాటుతున్న
కూలీల హాజరు
చెరువుల్లో ముమ్మరంగా
పూడికతీత పనులు


