సాక్షిప్రతినిధి,నిజామాబాద్: అటవీ శాఖలో నిజామాబాద్ సౌత్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) రాధిక డీజిల్ వినియోగంలో అక్రమాలకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు నిజమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సాక్షిలో ప్రచురించిన ‘అడవిలో డీజిల్ డ్రంకర్స్’ కథనంపై నిజామాబాద్ ఎఫ్‌డీవో సుధాకర్ స్పందించి విచారణ జరిపారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఆయన విచారణ నివేదికను మార్చి 16న అప్పటి జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) వికాస్‌మీనాకు పంపించారు. అక్కడి నుంచి రాష్ట్ర అటవీ ఉన్నతాధికారి (పీసీసీఎఫ్)కు వెళ్లిందో లేదో తెలియడం లేదు. అయితే, విచారణలో అవినీతి జరిగిందని నిగ్గు తేల్చినా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అనుమానం కలుగుతోంది. జిల్లా స్థాయిలోనే ఓ అధికారి ఆమైపె చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని, ఫైలును తెరపైకి రాకుండా చూస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం కొత్త డీఎఫ్‌వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్ వచ్చినా కూడా ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం. ప్రజలు అటవీ చట్టాలను ఉల్లంఘించిన వెంటనే వారిపై తక్షణ చర్యలు తీసుకునే అటవీ అధికారులే అవినీతికి పాల్పడితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
జరిగిన అవినీతి ఇదీ..
నిజామాబాద్ సౌత్ రేంజ్ అధికారిగా రాధిక పని చేసిన కాలంలో ప్రభుత్వం వాహనంలో డీజిల్ పోసినట్లుగా చూపడంతో పాటు దాని మీటర్ రీడింగ్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్వో ఇచ్చిన నివేదిక ఆధారంగా నిజామాబాద్ ఎఫ్‌డీవో సుధాకర్ డీఎఫ్‌వోకు నివేదికను పంపాల్సి ఉండగా కొంత జాప్యం జరిగినట్లు తెలిసింది. అధికారిణిపై విచారణ జరుగుతోందని ‘సాక్షి’లో కథనాన్ని ప్రచురించగా విచారణ మరింత లోతుగా జరిగింది. అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ జీపు 99,999 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ సున్నా నుంచి మొదలు కావాలి. కానీ, సదరు అధికారిణి 1,11,523 కిలో మీటర్లు తిరిగినట్లు చూపెట్టడంతో ట్యాంపరింగ్ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. తప్పుడు డీజిల్ బిల్లులు సమర్పించినట్లు గుర్తించారు. విచారణలో నిజం నిగ్గు తేలినా కూడా రెండు నెలలుగా ఆమైపె ఎలాంటి చర్యలు కానరాకపోవడం గమనార్హం. ఈ విషయంపై ప్రస్తుతం డీఎఫ్‌వో సిద్దార్థ్ విక్రమ్‌సింగ్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
మీటర్ రీడింగ్ ట్యాంపర్ చేసిన జీపు ఇదే.. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం
వెనకడుగు వేస్తున్న అధికారులు
డీజిల్‌లో అక్రమాలు నిజమేనని ‘సాక్షి’ కథనం ఆధారంగా విచారణ నివేదిక
అయినా చర్యలకు తాత్సారం చేస్తున్న అటవీ ఉన్నతాధికారులు
ఒత్తిళ్లకు తలొగ్గినట్లుగా అనుమానాలు


