మేలు రకం విత్తనాలను వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

మేలు రకం విత్తనాలను వినియోగించాలి

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌ : వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సుదర్శన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎల్‌ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున, తక్కువ నీటి వినియోగం అవసరం అయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు.

యువతకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు

యువత విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా జిల్లా కేంద్రంలోని న్యాక్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. శిక్షణ తరగతుల ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో చర్చించారు. సాంకేతిక విద్యకు సీఎం రేవంత్‌ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. మూడు నెలలపాటు వివిధ అంశాలపై ఇచ్చే శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కవితా రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement