పిల్లలకు డిజిటల్‌ సెలవులు ఇద్దాం | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు డిజిటల్‌ సెలవులు ఇద్దాం

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

తల్లిదండ్రులే వారికి మార్గదర్శులు

పెద్దలు క్రమశిక్షణ పాటించాలి

ఆటలు, శిక్షణ శిబిరాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి

ఎల్లారెడ్డి: వేసవి సెలవుల్లో పిల్లలను డిజిటల్‌ తెరల నుంచి కొంత దూరంగా ఉంచడం ఎంతో అవసరం. ప్రస్తుతం ఏ మాత్రం అవకాశం దొరికినా పిల్లలు సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం డిజిటల్‌ స్క్రీన్లు చూడటంతో పిల్లల్లో ఏ పని మీద శ్రద్ధ, ధ్యాస పెట్టే ఆలోచన ఉండటం లేదు. దీంతో పిల్లలు క్షణికావేశాలకు లోనవుతున్నారని, కంటి సమస్యలు, నిద్రలేమి, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. సహజ ఆలోచన శక్తి తగ్గిపోయి భవిష్యత్‌లో ఎదగాల్సిన చిన్నారులు సెల్‌ఫోన్లకు బందీ అవుతున్నారు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కుంటే హింసాత్మకంగా మారుతున్నా రు. కొంతమంది ఒంటరిగా గదిలో కూర్చుంటున్నా రు. స్కూళ్లలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు ఎక్కువ కాలం వారికి గుర్తుండటం లేదు. ఇవి పిల్లలలో మొండి లక్షణాలు కావు. డిజిటల్‌ వ్యసనాల తీవ్రతకు ఇవి గుర్తులు. వారంలో కనీసం ఒకరోజైనా పిల్లలను డిజిటల్‌ స్క్రీన్లకు దూరంగా ఉంచాలని వైద్యుల సలహా ఇస్తున్నారు.

● పాతతరం వారు ఎక్కువ సమయం కబడ్డీ, కోతి కొమ్మచ్చి, బొంగరాలు, గోళీలాటలు వంటి ఆటలను మైదానాల్లో ఆడేవారు. ఈ ఆటలతో వారు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేవారు. ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎంతసేపూ సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లతోనే గడుపుతూ కాలు బయటపెట్టడం లేదు.

● పిల్లలు సెల్‌ఫోన్లకు బానిసలు కావడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రధానంగా ఉంది. పసిప్రాయంలో తినకుండా మారాము చేస్తుంటే బొమ్మలు వస్తున్నాయంటూ వారికి సెల్‌ఫోన్లను ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. సెల్‌ఫోన్లు వాడకుండా నిరోధించాల్సిన తల్లిదండ్రులే వారి ముందే గంటల తరబడి సెల్‌ఫోన్లలో గడపడం మరో కారణం.

సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లకు అతుక్కుపోయిన పిల్లలు

పిల్లలను డిజిటల్‌ తెరలకు దూరంగా ఉంచే మార్గాలు

పిల్లలకు రోజూవారీ టైంటేబుల్‌ తయారు చేయాలి. చదువు, ఆటలు, విశ్రాంతి, కుటుంబసభ్యులతో గడపడం ఇలా ఒక షెడ్యూల్‌ పెట్టాలి. ఖాళీ సమయం ఎక్కువైతే పిల్లలు మొబైల్‌ వైపు ఆకర్షితులవుతారు.

బయట ఆటలకు ప్రోత్సహించాలి. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, సైక్లింగ్‌, ఈత వంటి శారీరక క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి. యోగా శిక్షణ ఇప్పిస్తే మరీ మంచిది.

పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. పిల్లలకు కథలు, కామిక్స్‌, బాలల పత్రికలు, జ్ఞానం, తెలివి అందించే పుస్తకాలు ఇవ్వాలి.

కుటుంబసభ్యులు కలిసి ఆడే క్యారమ్‌, చెస్‌, అష్టాచెమ్మ లాంటి పల్లె ఆటలు, కథలు చెప్పడం వంటి కార్యక్రమాలో పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించాలి.

డ్రాయింగ్‌, పెయింటింగ్‌, క్రాఫ్ట్‌, సంగీతం, నృత్యం వంటి హాబీలను ప్రోత్సహించాలి.

డిజిటల్‌ స్క్రీన్‌ టైమ్‌కు పరిమితి పెట్టాలి. రోజుకు ఎంతసేపు మొబైల్‌ లేదా టీవీలను చూడాలో ముందుగానే నిర్ణయించాలి.

వేసవి శిబిరాల్లో చేర్పించాలి. సమ్మర్‌ క్యాంపులు, క్రీడాశిక్షణ శిబిరాలు, ఆర్ట్స్‌ క్లాసులలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

నిద్రకు ముందు కనీసం గంట పాటైనా స్క్రీన్‌లకు దూరంగా ఉండేలా చూడాలి.

పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలి.

పిల్లలకు ప్రేమగా చెప్పి అలవాట్లు మార్చితే మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement