చూపు లేదు.. పిలిస్తే పలికేవారు వెళ్లిపోయారు
● తల్లి, సోదరుడిని కోల్పోయి
ఒంటరిగా మిగిలిన స్వప్న
● తల్లడిల్లుతున్న అంధురాలు
బోధన్‌రూరల్: చూపు లేకున్నా తల్లి కళ్లతో లోకాన్ని చూసింది. తండ్రిలా కంటికి రెప్పలా కాపాడే అన్న ఉన్నాడన్న మనోధైర్యంతో జీవించింది. ఇప్పుడు ఆ ఇద్దరూ లేక అంధకారం నుంచి అగాధంలోకి జారింది. తల్లిని, అన్నను కోల్పోయి తల్లడిల్లుతున్న స్వప్న కథ ఇది..
భర్తను కోల్పోయిన బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామానికి చెందిన పద్మినీబాయి(70) కొడు కు సునీల్‌దేవ్ (30), కూతురు స్వప్న(25)తో కలి సి జీవిస్తోంది. సునీల్‌దేవ్‌కు పెళ్లయినప్పటికీ భా ర్యతో విభేదాల కారణంగా భార్య వెళ్లిపోయింది. స్వప్నకు పుట్టుకతో ఒక కన్ను కనిపించకపోగా, రెండేళ్ల క్రితం మరో కన్ను పోవడంతో అంధురాలిగా మారింది. పద్మినీబాయి కొడుకు, కూతురు తో కలిసి జీవిస్తోంది. మంగళవారం రాత్రి ముగ్గు రూ కలిసి భోజనం చేసి నిద్రించారు. పద్మినీబా యి నిద్రలోనే చనిపోగా, అర్ధరాత్రి నిద్రలేచిన సునీల్ తల్లి మృతి చెంది ఉండడాన్ని గమనించి మనస్థాపానికి గురై ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం నిద్రలేచిన స్వప్న తల్లిని, అ న్నయ్యను పిలవగా ఎంతకూ స్పందన లేకపోవడంతో భయంతో గట్టిగా రోదించింది. స్వప్న ఏడుపు విన్న చుట్టు పక్కల వారు వారి వచ్చి చూడగా పద్మినీబాయి, సునీల్‌దేవ్ విగతజీవులు గా కనిపించారు. తన తల్లి, అన్నకు ఏమైందని స్వప్న గట్టిగా రోదిస్తూ ప్రశ్నిస్తుండడంతో అక్కడు న్న వారు సమాధానం చెప్పలేక కన్నీరుమున్నీరయ్యారు. విషయం అర్థమైన స్వప్న తనకు దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది. గ్రామస్తులు తల్లీకొడుకుల అంత్యక్రియలను పూర్తి చేశారు. గురువారం గ్రామస్తులతోపాటు బాధిత కుటుంబ బంధువులు స్వప్న సంరక్షణపై చర్చించారు. ఇద్దరు మేనత్తలు స్వప్న సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. అంధురాలైన స్వప్నకు పింఛన్ రావడం లేదని ప్రభుత్వం స్పందించి పింఛన్ అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


