నల్లమట్టి పక్కదారి! | - | Sakshi
Sakshi News home page

నల్లమట్టి పక్కదారి!

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

క్యూ ఆర్‌ కోడ్‌ లేకుంటే సీజ్‌ చేస్తాం

వాహనాలకు ‘క్యూఆర్‌’

నిబంధన ఉట్టిమాటే

‘మామూలు’గానే అధికారుల తీరు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో తవ్వుతున్న నల్లమట్టి పక్కదారి పడుతోంది. వ్యాపారులు రైతుల పేరు చెప్పి ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. వాహనాలకు క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ నిబంధనను సైతం పాటించడం లేదు. డొంకేశ్వర్‌ మండలం అన్నారం, సిర్పూర్‌, నికాల్‌పూర్‌ ప్రాంతాల్లో నల్లమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పంట పొలాలకు కాకుండా ఇతర అవసరాలకు పక్క దారి పట్టకుండా రెవెన్యూ ఉన్నతాధికారులు ‘క్యూ ఆర్‌ కోడ్‌’ నిబంధన పెట్టారు. తవ్వకాలు జరిగే చోట జీపీవోలను పెట్టి క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లను వాహనాల అద్దాలకు అతికిస్తున్నారు. స్టిక్కర్‌లో రైతు పేరు, సర్వే నంబరు, ఊరు పేరు నమోదై ఉంటుంది. సంబంధిత రైతుకు కాకుండా వేరే చోట నల్లమట్టి పోస్తే వెంటనే తెలిసిపోతుంది. అయితే, గత కొన్ని రోజులుగా వాహనాలకు క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్లు కనిపించడం లేదు. తవ్వకాలు జరిగే చోట జీపీవోలు ఉండడం లేదు. అధికారులతోపాటుగా జీపీవోలకు ముడుపులు అందడంతోనే నల్లమట్టి క్యూఆర్‌ నిబంధనలు తుంగలో తొక్కి నల్ల మట్టిని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

తెర వెనుక వీడీసీల పాత్ర

నల్లమట్టి తవ్వకాల వెనుక వీడీసీల పాత్ర కనిపిస్తోంది. ఓ గ్రామంలో వీడీసీ ఏకంగా వేలం నిర్వ హించగా వ్యాపారులు రూ.4లక్షలు వీడీసీకి చెల్లించి తవ్వకాలు చేస్తున్నారు. మరో వీడీసీ సభ్యులు ట్రిప్పు లెక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు అధిక ధరలకు నల్లమట్టిని విక్రయిస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.

నల్లమట్టి తరలించే వాహనాలకు క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. క్యూ ఆర్‌ కోడ్‌ లేకుండా వాహనాలు ఎలా బయటకు వస్తున్నాయో తెలుసుకుంటా. రైతుల పొలాలకు కాకుండా వేరే అవసరాలకు తరలించినా, కోడ్‌ స్టిక్కర్‌ లేకపోయినా ఆ వాహనాలను సీజ్‌ చేస్తాం.

– ప్రసాద్‌, తహసీల్దార్‌, డొంకేశ్వర్‌

Advertisement
 
Advertisement
Advertisement