● రూ. లక్ష జరిమానా విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
కామారెడ్డి టౌన్ : ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (రేప్ – పోక్సో కేసుల విచారణ కోర్టు) జిల్లా న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్ వీవీఆర్ వరప్రసాద్ గురువారం సంచలన తీర్పు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తాడ్వాయి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ రహీం 2022 ఆగస్టు 5న స్కూల్‌కు వెళ్తున్న బాలికను మాయమాటలతో కామారెడ్డి రైల్వే స్టేషనన్‌కు రప్పించి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తమ కూతురు ఆచూకీ లభించడం లేదని తల్లిదండ్రులు తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు బాలికను తీసుకొచ్చారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్‌రావు నేతృత్వంలో పోలీసులు పకడ్బందీగా సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడికి శిక్ష పడేలా అంకితభావంతో పనిచేసిన డీఎస్పీలు శ్రీనివాసులు, శ్రీనివాస్ రావు, ఏపీపీలు శేషు, సూర్యప్రసాద్, తాడ్వాయి ఎస్‌హెచ్‌వో వై. నరేశ్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి సాయిబాబును ఎస్పీ రాజేశ్‌చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.
నిజామాబాద్ లీగల్: మామను చంపిన అల్లుడికి పదేళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మహిళా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ నుంచి నవీపేట్ మండలం అనంతగిరికి వలస వచ్చిన రాజేశ్ దుర్వే తరచూ తన భార్య గోమతితో గొడవ పడేవాడు. 2025 ఏప్రిల్ 27వ తేదీన గొడవ పడుతుండగా అక్కడే ఉన్న మామ భీమ్‌సింగ్ నిలదీయడంతో రాజేశ్ తన చేతిలోని ఇటుకతో మామ తలపై కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో రాజేశ్ దుర్వేకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.


