● నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
జక్రాన్‌పల్లి: సౌర విద్యుత్ ఉత్పత్తికి జక్రాన్‌పల్లి మండలం కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. రాష్ట్రంలోనే మొదటి సోలార్ ప్లాంట్‌ను జక్రాన్‌పల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కలిగోట్ సబ్‌స్టేషన్ పరిధిలో మరో ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. మండలంలోని మనోహరాబాద్ శివారులో పడకల్‌కు చెందిన రైతు మగ్గిడి సుదర్శన్‌రెడ్డి తనకున్న 6 ఎకరాల భూమిలో పీఎం కుసుమ్ ప్రాజెక్టులో భాగంగా రెడ్‌కో ఆధ్వర్యంలో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సహకారంతో రూ.7 కోట్ల వ్యయంతో సుదర్శన్‌రెడ్డి ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా, 25 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.13 చొప్పున చెల్లించేందుకు ఎన్‌పీడీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంట్‌ను ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రాజేశ్వర్ శుక్రవారం ప్రారంభించనున్నారు.


