పసిడి పంట ఆయిల్‌పామ్‌ | - | Sakshi
Sakshi News home page

పసిడి పంట ఆయిల్‌పామ్‌

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

కొత్త రైతులకు సువర్ణావకాశం

36 నెలల తర్వాత..

ఆర్మూర్‌: వరి,మొక్కజొన్న, పసుపు వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పా మ్‌ సాగు జిల్లా రైతాంగానికి కొత్త ఆశలు రేపుతోంది. ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌ గ్రామంలో వజ్రం రెడ్డి అనే రైతు తన 5.20 ఎకరాల తోటలో బుధవారం మొదటి గెలల కోత పండుగలా నిర్వహించారు. హార్టికల్చర్‌ ఆఫీసర్‌ సంధ్య రాణి, ఆయిల్‌పామ్‌ క్లస్టర్‌ ఆఫీసర్‌ పురుషోతం, స్థానిక రైతులు పాల్గొని కొత్త సాగుదారులకు స్ఫూర్తినిచ్చారు.

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు నాలుగేళ్ల్ల ప్రస్థానం..

జిల్లాలో 2022–23 సంవత్సరంలో ఆయిల్‌పామ్‌ సాగు మొదలైంది. కేవలం నాలుగేళ్ల్లలోనే రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపడంతో ఇప్పటివరకు 6,200 ఎకరాలకు విస్తరించింది. ఇందులో 1,540 ఎకరాలు ఇప్పటికే కోత దశకు చేరి, 2,200 మెట్రిక్‌ టన్నుల ఫ్రెష్‌ ఫ్రూట్‌ బంచెస్‌ దిగుబడి సాధించారు.

అంతర పంటలు...

ఆయిల్‌పామ్‌లో మొదటి మూడు, నాలుగేళ్ల్లు పసుపు, కూరగాయలు, బొప్పాయి, అరటి, పూల మొక్కలు, ఇతర ఆరుతడి పంటలను అంతర పంటగా వేసి అదనపు ఆదాయం పొందవచ్చు. పశుపోషణ: తోటలో కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుకోవచ్చు. వాటి నుంచి వచ్చే ఎరువును సేంద్రియ ఎరువుగా వాడుకుంటే ఖర్చు తగ్గి, నేల సారం పెరుగుతుంది.

ఆయిల్‌పామ్‌ పండించడానికి ఆసక్తి ఉన్న కొత్త రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. ఆయిల్‌పామ్‌ మొక్కలపై 90 శాతం సబ్సిడీ, డ్రిప్‌ ఇరిగేషన్‌పై ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, బీసీలు, చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం సబ్సిడీని ఇవ్వనున్నారు. నిర్వహణ, అంతర పంటల కోసం మొదటి నాలుగేళ్లు ఎకరానికి రూ.4,200లను అందించనున్నారు. ఒకసారి నాటితే 25–30 ఏళ్ల పాటు ఆదాయం ఇస్తుంది. ప్రతి నెలా కోత ఉంటుంది కాబట్టి నెల నెలా రైతుకు డబ్బులు చేతికొస్తాయి.

– సంధ్యారాణి, హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఆర్మూర్‌

ఆయిల్‌పామ్‌ మొక్క నాటిన 36 నెలలు నిండిన తర్వాత కోతకు వస్తుంది. ఆ తర్వాత ప్రతి నెలా ఒకసారి గెలల కోత తీసుకోవచ్చు. అంటే సంవత్సరం పొడుగునా రైతుకు ఆదాయం ఇచ్చే పంట ఇది. జిల్లాలో ఈ ఏడాది ఎకరాకు 4 నుంచి 7 మెట్రిక్‌ టన్నుల గెలలను తీసిన రైతులు ఉన్నారు. సరైన యాజమాన్యం పద్ధతులు పాటిస్తే 10–12 టన్నుల వరకు దిగుబడి సాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మార్చిలో టన్నుకు రూ. 14,392 ఉన్న ధర, కేంద్రం పామాయిల్‌ దిగుమతి సుంకం 27.5%కి పెంచడంతో క్రమంగా పెంచింది. దీంతో ప్రస్తుత నెలలో టన్ను ఫ్రెష్‌ ఫ్రూట్‌ బంచెస్‌ ధర రూ.23,501 కి చేరింది. ఇదే ఇప్పటి వరకు వచ్చిన అధికమైన ధర. రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరను రూ.25 వేలకు పెంచాలని కేంద్రాన్ని కోరుతోంది. ఎకరంలో పంట పండించడానికి మొక్కలు, డ్రిప్‌, ఎరువులను కలుపుకొని సుమారుగా రూ.40 వేల ఖర్చు అవుతోంది. దీంట్లో సబ్సిడీ పోను రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది.

జిల్లాలోని రైతుల చేతిలో ‘నల్ల బంగారం’

ఆయిల్‌పామ్‌పై 90 శాతం సబ్సిడీ..

నెల నెలా ఆదాయం

జిల్లాలో నాలుగేళ్లలో 6,200

ఎకరాల్లో విస్తరణ..

టన్నుకు రూ.23,501 రికార్డు ధర

ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌లో

మొదటి గెలల కోతలు

ప్రారంభించిన హార్టికల్చర్‌ ఆఫీసర్‌

Advertisement
 
Advertisement
Advertisement