నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ బుధవారం తన చాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలు, ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితాలు, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించేందుకు వీలుగా సమగ్ర వివరాలతో నివేదికలను అందించాలని ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా ప్రదర్శించేలా నివేదికలు ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, శాఖల వారీగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, సీపీవో రతన్, డీపీఆర్వో ఎన్ పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ డేను వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు వీఎన్ వర్మ మాట్లాడుతూ.. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. వ్యాపారాలు సరళీకృతంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పడుతున్న సవరణల కారణంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ నామమాత్రమవుతున్నా తూనికలు, కొలతల్లో వినియోగదారులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అనంతరం డీఎస్‌వో కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్‌వో అరవింద్‌రెడ్డి, వినియోగదారుల ఫోరం జిల్లా కోశాధికారి మహాదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏడీఏను ఇవ్వాలని, జనవరి ఒకటవ తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న ఏడీఏను వెంటనే చెల్లించాలని బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆల్ యూనియన్ అండ్ అసోసియేషన్స్ (ఏయూఏబీ) పిలుపు మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు, ఎన్‌ఎఫ్‌టీఈ ఉద్యోగులు, ఎస్‌ఎన్‌ఈఏ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం నగరంలోని గాంధీచౌక్‌లో ఉన్న సంచార్ భవన్ వద్ద ధర్నా, మానవహా రం నిర్వహించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో అఫెర్టబిలిటీ కండిషన్‌ను తొలగించాలని డిమాండ్‌చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్‌బాబు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కే రామ్మోహన్‌రావు, డి సాయిలు, సాయన్న, చంద్రశేఖర్, రాజేందర్, సందీప్ రాటి, అనురాధ, లత, సుభాష్, రిటైర్డ్ ఉద్యోగులు మధుసూదన్, బాల దుర్గయ్య, గంగాధర్, పాండురంగం తదితరులు పాల్గొన్నారు.


