నిజామాబాద్ రూరల్: ఆన్‌లైన్ ఫార్మసీల (ఇ–ఫార్మసీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1400 వరకు మెడికల్ షాపులను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. నిజామాబాద్ నగరంలో పరిధిలోనే దాదాపు 700 ఔషధ దుకాణాలను మూసివేశారు. మెడికల్ షాపులు బంద్ కావడంతో ఉదయం వేళల్లో రోగులు, వారి బంధువులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా డ్రగ్స్ కంట్రోల్ విభాగం ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫార్మసీల నిర్వాహకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్స్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ..ఇ–ఫార్మసీల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆన్‌లైన్ సంస్థలు ఇష్టారాజ్యంగా ఇస్తున్న భారీ డిస్కౌంట్ల కారణంగా చిన్న, మధ్య తరహా మెడికల్ షావుల మనుగడ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ప్రిస్క్రిప్షన్లతో ఆన్‌లైన్ మందులు విక్రయించడం వల్ల యువత ప్రాణాల మీదకు వస్తోందని హెచ్చరించారు. కరోనా సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం తెచ్చిన తాత్కాలిక జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.సుధాకర్, కోశాధికారి మొర సాయిలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


