ఊపిరి పీల్చుకున్న ఇటుకబట్టీ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకున్న ఇటుకబట్టీ కార్మికులు

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి చొరవతో ఆలూర్‌ మండలం దేగాం, ఆర్మూర్‌ మండలం మగ్గిడి ఇటుక బట్టీలో పని చేస్తున్న కార్మికులకు విముక్తి లభించింది. కొన్ని సంవత్సరాలుగా ఇటుక బట్టీ నిర్వాహకుల దాష్టికానికి గురైన కార్మికులు ఎట్టకేలకు విముక్తి లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి ఆధ్వర్యంలో పోలీస్‌, లేబర్‌, రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం ఇటుక బట్టీలపై తనిఖీలు నిర్వహించి 112 కుటంబాలకు చెందిన సుమారు 548 కార్మికులను ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలోని ఫంక్షన్‌ హాల్‌కు తరలించారు. అనంతరం 481 మంది కార్మికులను అదే రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు తరలించారు. నెల్లూరుకు చెందిన 37 మంది, తమిళనాడుకు చెందిన 30 మంది కార్మికులకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వసతి కల్పించారు. బుధవారం ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు కార్మికుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. బట్టీలో కార్మికులు అనుభవించిన కష్టాలు, యజమానులు హింసించే తీరును అధికారులకు వివరించారు. కార్మికుల వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యానారయణ గౌడ్‌ తెలిపారు. అలాగే ఆర్మూర్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి కార్మికులు వసతి పొందుతున్న పాఠశాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నిర్వాహకుల ఆకృత్యాలు అంతా ఇంతాకాదు..

ఇటుక బట్టీల్లో యజమానులు తిరుపతి రెడ్డి, కిరణ్‌ రెడ్డి, మళ్లికార్జున్‌ రెడ్డిలు వేకువ జామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వెట్టి చాకిరీ చేయించేవారని కార్మికులు గోడు వెల్లబోసుకున్నారు. ఇటుకల తయారీలో లక్ష్యం చేరుకోక పోతే తీవ్రంగా హింసించేవారన్నారు. చేసిన కష్టానికి ప్రతి సోమవారం రూ.300 నుంచి 500 వెల కడుతూ చీటి రాసి ఇచ్చేవారని, డబ్బులు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కిరాణ, కూరగాయల వ్యాపారులకు చీటిని చూపిస్తే సరిపడా సరుకులు ఇచ్చేవారని తెలిపారు. ఎప్పుడు లెక్కలను తారుమారు చేస్తూ కార్మికులే అప్పుగా ఉన్నట్లు చూపించే వారన్నారు. దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే కొట్టేవారన్నారు. అలాగే తాము పారిపోకుండా ప్రతిరోజు ఒక కుటుంబం నుంచి ఒకరిని ఇతర చోట బందీగా ఉంచేవారన్నారు.

కార్మికులకు విముక్తి లభించడంతో దేగాంలో ఖాళీగా కనిపిస్తున్న గుడారాలు

ఇటుక బట్టీ కార్మికుల నుంచి ఆధారాలు

సేకరిస్తున్న పోలీసులు

నిర్వాహకులపై పలు

సెక్షన్ల క్రింద కేసులు నమోదు..

కార్మికులను బానిసలుగా చేసుకుని ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్న తిరుపతి రెడ్డి, కిరణ్‌ రెడ్డి, మళ్లికార్జున్‌ రెడ్డిలపై బాల కార్మికుల వినియోగ చట్టం, బాండెడ్‌ లేబర్‌ అబాలిషన్‌ చట్టం వంటి పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయన గౌడ్‌ తెలిపారు.

అనారోగ్యంతో ఉన్నా పని చేయాల్సిందే..

అనారోగ్యానికి గురైనా బలవంతంగా పని చేయించే వారు. ఇటుకల తయారీ ఆలస్యమైతే పైశాచికంగా హింసించేవారు. లెక్కలు తారు మారు చేస్తూ ఎప్పుడూ బాకీల కిందే ఉంచుతూ పని చేయించేవారు. కుటుంబానికి ఒకరిని నిర్బంధించి బానిసలుగా పని చేయించారు. అధికారుల చొరవతో సొంత రాష్ట్రం వెళ్తుండడం ఆనందంగా ఉంది. – కన్యప్పన్‌, దేగాం

ఇటుక బట్టీ కార్మికుడు, తమిళనాడు

కార్మికులను నెల్లూరుకు

తరలించిన అధికారులు

మిగతా వారి ఆధారాలు సేకరిస్తున్న

పోలీసులు

నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద

కేసులు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement