ఖలీల్‌వాడి: జిల్లా విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీ లు జరగనున్నాయి. క్షేత్రస్థాయి నుంచి అధికారుల వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 31లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ సమీకృత భవనంలో ఉదయం 11 గంటల నుంచి బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
వివిధ పోస్టుల్లో బదిలీలు..
విద్యాశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్టినేటర్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్లు, సూపరిన్‌టెండెంట్‌లు, వివిధ ఉద్యోగులు వరంగల్‌లోని ఆర్‌జెడీలో దరఖాస్తు చేశారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేయనున్నారు. ఆలాగే జిల్లా స్థాయి పోస్టుల్లో ఉన్న అధికారులు హైదరాబాద్‌లోని పాఠశాల డైరెక్టరేట్‌లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25 వరకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. వీరి బదిలీలు ఆన్‌లైన్‌లో జరగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందిని మాత్రమే బదిలీ చేయనున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 15 వరకు ఉద్యోగుల నుంచి ఐదు ఆప్షన్లతో దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 16 నుంచి 24 వరకు దరఖాస్తుల పరిశీలన, కౌన్సెలింగ్ నిర్వహణ ఉంటుంది. ఈనెల 25 నుంచి 31 వరకు బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉత్తర్వులు విడుదలైన మూడు రోజుల్లో బదిలీ అయిన ఉద్యోగులు పోస్టింగ్ ప్రదేశాల్లో విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
బదిలీలకు అర్హతలివే..
ఉద్యోగ కనీస సర్వీసు: ఈ ఏడాది జనవరి 1 నాటికి ఒకే చోట కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి.
గరిష్ఠ సర్వీసు: ఒకే చోట నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు.
మినహాయింపు: వచ్చే ఏడాది మే 31లోగా ఉద్యోగ విరమణ పొందేవారు అభ్యర్థిస్తే తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రాధాన్యత: భార్యాభర్తలైన (స్పౌజ్‌కేసులు) ఉద్యోగులు, 70 శాతం వైకల్యం పైబడిన దివ్యాంగులు, వితంతువులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు బదిలీలలో ప్రాధాన్యం ఉంటుంది.


