నిజామాబాద్‌అర్బన్: జన గణనలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా గంగస్థాన్ ఫేజ్ –1 లో పద్మజ అనే మహిళ ఇంటిని సందర్శించారు. ఎన్యుమరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని భారతి గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. జన గణన కోసం వెళ్లే సందర్భంలో ప్రతి ఎన్యుమరేటర్ క్యూ.ఆర్ కోడ్ తో జారీ చేయబడిన ఐడీ కార్డును తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే తమ ఇళ్లకు జన గణన కోసం వచ్చే ఎన్యుమరేటర్ ఐడీ కార్డును పరిశీలించిన తరువాతే అనుమతించాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేటర్ అడిగే వివరా లను తెలిపి సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నగర పాలక సంస్థ ఈఈ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు ఉన్నారు.


