ఉపాధి కూలీలకు పంచాయతీల అండ! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు పంచాయతీల అండ!

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడి భగభగలు పెరిగిపోతుండడంతో ఏకంగా 45 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీల ఆరోగ్యరక్షణ కోసం గ్రామ పంచాయతీలు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టా రు. జిల్లాలో 545 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు కొనసాగుతుండగా.. నిత్యం 67 వేల మంది కూలీలు పనులకు వస్తుండగా, వారి తో పూడికతీత పనులు చేయిస్తున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు ప్రతాపం మొదలవుతోంది. దీంతో ఉదయం 6 గంటలకే పనులకు వచ్చినా రెండో ఫొటో కోసం కూలీలు మధ్యాహ్నం 12గంటల వరకు ఉండాల్సి వస్తోంది. దీంతో ఎండదెబ్బ తగలకుండా కూలీలను కాపాడేందుకు పనులు జరిగే ప్రాంతాల్లో తాత్కాలిక నీడ కోసం ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల తరఫున సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకుని కూలీల కోసం చల్లని తాగునీరు, మజ్జిగను అందుబాటులో ఉంచుతున్నారు. ఎండ తీవ్రతకు కూలీలు నీరసపడకుండా ఉండేందుకు కొందరు సర్పంచులు స్వ చ్ఛందంగా కూల్‌ డ్రింక్స్‌, బిస్కెట్‌ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అదే విధంగా వడదెబ్బ తగలకుండా కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. దాహం వేసినా, నీరసంగా అనిపించినా వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. వడ దెబ్బబారిన పడకుండా సర్పంచులు, అధికారులు స్పందించి తమకు అన్ని వసతులు కల్పిస్తుండడంపై ఉపాధి కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీడ వసతితోపాటు చల్లని మజ్జిగ, అల్పాహారం అందిస్తుండడంతో తాము ధైర్యంగా పనులకు రాగలుగుతున్నామని కూలీలు అంటున్నారు.

కూలీల రక్షణకు ప్రాధాన్యత

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉపాధిహామీ పని ప్రదేశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఉదయం పూటనే పనులు త్వరగా ముగించేలా పని వేళల్లో మార్పులు చేశాం. గ్రామ పంచాయతీలు, సర్పంచులు ముందుకు వచ్చి చల్లని మజ్జిగ, కూల్‌డ్రింక్స్‌, అల్పాహారం అందజేస్తుండడం అభినందనీయం.

– బూక్యా లింగం, ఎంపీడీవో, డొంకేశ్వర్‌

పని ప్రదేశాల్లో నీడనిచ్చే షెడ్ల ఏర్పాటు

కూలీలకు మజ్జిగ, బిస్కెట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ

ఎండ తీవ్రత నేపథ్యంలో

సర్పంచులు, అధికారుల చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement