బాట్లకు తుప్పు.. కాంటాల ట్యాంపరింగ్‌ | - | Sakshi
Sakshi News home page

బాట్లకు తుప్పు.. కాంటాల ట్యాంపరింగ్‌

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

నిజాయితీగా అమ్మకాలు సాగించాలి..

తూనికలు, కొలతలపై అధికారుల

నామమాత్రపు తనిఖీలు

నేడు అంతర్జాతీయ లీగల్‌ మెట్రాలజీ డే

నిజామాబాద్‌ రూరల్‌: కిరాణా దుకాణం నుంచి బంగారం షాపు వరకు ప్రతీది తూకం వేసిన తర్వాతే వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు. సాంకేతికత పెరిగినా... పలుచోట్ల ఇంకా పాత పద్ధతిలోనే తూనికలు, కొలతలు కొనసాగుతున్నాయి. డిజిటల్‌ తూకాలు వచ్చినా అరిగిన తూకం బాట్లు, రాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు మోసపోతున్నారు. నేడు అంతర్జాతీయ లీగల్‌ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

నకిలీ తూకాలు, ఎలక్ట్రానిక్‌ కాంటాల ట్యాంపరింగ్‌, సున్నితమైన ఎలక్ట్రానిక్‌ కాంటాల వాడకంతో అవకతవకలకు అవకాశం ఉంది. ఎక్కువ వాడకంతో తూకం బాట్ల అరుగుదల, గాలి తేమతో తుప్పుపట్టడం, కావాలనే కొందరు వ్యాపారస్తులు అరుగు తీయడం, ఎలక్ట్రానిక్‌ కాంటాల ట్యాంపరింగ్‌తో తక్కువ తూకాల్ని ఎక్కువగా చూపడంతో వినియోగదారులు మోసపోతున్నారు.

తనిఖీలు తప్పనిసరి..

వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు లీగల్‌ మెట్రా లజీ ఇన్‌స్పెక్టర్లు ప్రతి సంవత్సరం తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కిరాణ, బంగారం, కూరగాయలు తదితర విక్రయాలు నిర్వహించే తూకాలను పరిశీలించి స్టాంపింగ్‌ వేయాలి. కానీ, అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలుదారులు సైతం సరైన తూకం ఉంటేనే వస్తువులు తీసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే లీగల్‌ మెట్రాలజీ శాఖ అధికారులను లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది.

అమ్మకందారులు నమ్మకంగా వ్యవహరించాలి. బాట్లకు బదులు రాళ్లు వేసి తూకం వేస్తున్నారు. అవి సరైన బరువు ఉన్నాయో లేదో తెలియదు. వినియోగదారులను మోసం చేస్తే సహించం. నిజాయితీగా అమ్మకాలు చేపట్టాలి.

–సాంబరాజు చక్రపాణి

(వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి)

Advertisement
 
Advertisement
Advertisement