బోధన్: పట్టణంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కామేపల్లి సత్యనారాయణ, నాగవర్ధిని దంపతుల కుమారుడు సాయికృష్ణ అమెరికా దేశంలోని కొలంబియా యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. నాలుగు రోజుల క్రితం కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పట్టా అందుకున్నారు. ‘వ్యాపార సంస్థల నిర్ణయాలు–ఒక దేశం ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాలు’ అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించారు. సాయికృష్ణ బోధన్‌లోని విజయ సాయి హైస్కూల్‌లో పదోతరగతి, హైదరాబాద్‌లో ఐఐటీ రామయ్య అకాడమీలో ఇంటర్ విద్యను పూర్తి చేశారు. ముంబైలో ఐటీ చదివి, 2016లో అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేశారు.
‘ఆరోగ్య మహిళ’ను
పక్కాగా నిర్వహించాలి
నిజామాబాద్ రూరల్: ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్ రాజశ్రీ అన్నారు. నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులకు రక్తహీనత, పోషకాహరంపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
ఎండకాలం నేపథ్యంలో వడదెబ్బ కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. వైద్యాధికారిణి ప్రత్యూష , పీహెచ్‌ఎన్ ప్రమీలారాణి, ఏఎన్‌ఎంలు, ఆశాలు ఉన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
ఒకరికి జైలు శిక్ష
ఇందల్వాయి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మిట్టపల్లి గ్రామానికి చెందిన ఒకరికి న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని జిల్లా స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట మంగళవారం హాజరు పర్చగా న్యాయమూర్తి అహ్మద్ సదరు వ్యక్తికి శిక్ష విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.


