బాన్సువాడ రూరల్: ఎండవేడిమి తట్టుకోలేక స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళిన ఓ యువకుడు నీటికుంటలో మునిగి ఊపిరాడక మృతి చెందిన ఘటన సోమేశ్వర్ గ్రామంలో చోటుచేసుకుంది. కోటగిరి మండలం హంగర్గాఫారం గ్రామానికి చెందిన యువకుడు షేక్ అయాన్(22) జీవనోపాధికోసం ప్రతి రోజు బాన్సువాడలో సెంట్రింగ్ పనులకు వస్తుంటాడు. మంగళవారం బాన్సువాడకు వచ్చిన అయాన్ స్నేహితులైన ఎండీ ముఖ్తార్, ఎండీ రెహాన్, ఎండీ సోహెల్‌తో కలిసి సోమేశ్వర్ శివారులోని స్టోన్‌క్రషర్‌ల వద్ద మైనింగ్ కోసం తీసిన గుంతలో స్నానానికి వెళ్లాడు. కుంటలో ఈతకొడుతూ లోతైన ప్రాంతానికి వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు, చుట్టుపక్కల వారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూటీం సహాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి తండ్రి చాంద్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
275 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
బోధన్ టౌన్ (బోధన్) : పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీ లో ఉన్న సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మి ల్లుపై పోలీసులు మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేసి 275 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. రెండు డీసీఎంలలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. బియ్యంతోపాటు వాహనాలను సీజ్ చేశామన్నారు.


