● క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.7,200కు..
● అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్
● అన్ సీజన్‌లో పెరిగిన రేటు
మోర్తాడ్(బాల్కొండ): సోయా గింజలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడటంతో ధర గణనీయంగా పెరిగింది. క్వింటాల్ ధర ఏకంగా రూ.7,200 పలుకుతోంది. సీజన్‌లో వ్యాపారులు రూ.4,500 లోపు ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల వరకు విస్తీర్ణంలో రైతులు సోయా సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని దిగుబడి తగ్గడం, మార్కెట్‌లో ఆశించిన ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపడంతో సోయా సాగు విస్తీర్ణం 30వేల ఎకరాలకే పరిమితమైంది. సీజన్‌లో రూ.5వేలు దాటని ధర ఇప్పుడు భారీగా పెరగడంతో స్టాక్ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో సోయా ధర అనూహ్యంగా పెరిగింది. వచ్చే వర్షాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.


