రైతన్నా.. నన్ను కాల్చకు.. | - | Sakshi
Sakshi News home page

రైతన్నా.. నన్ను కాల్చకు..

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

నేలతల్లి రోదన:

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఓ రైతన్నా! ఆరుగాలం కష్టపడి నన్ను నమ్ముకున్న నిన్ను... కన్న బిడ్డలా సాకి అన్నం పెట్టాను. పంట కోసిన తర్వాత నా ఒడిలో మిగిలిన వ్యర్థాలకు నిప్పు పెట్టి ఎందుకు కాల్చుతున్నావు? ఆ మంటలు నా శరీరానికి తగిలి నేను తల్లడిల్లిపోతున్నాను. అగ్గి గాయాలతో మండిపోతున్నాను. నాలోని సారాన్ని, నాకు మేలు చేసే సూక్ష్మజీవులను అగ్నికి ఆహుతి చేయకు. నేను బలహీన పడితే రేపు నీకు నాణ్యమైన పంటను ఎలా ఇవ్వగలను? ఇకనైనా మార్పు తెచ్చుకో... దయచేసి నన్ను రక్షించు.

పచ్చని చెట్ల ఆవేదన:

నాడు మీకు ప్రాణవాయువునిచ్చి నిలిపాను. నేడు ప్రాణమున్న శవమై మిగిలా ను.పచ్చని ఆకులతో బాటసారికి నీడనిచ్చా.. కానీ, నీ స్వార్థపు సెగలో నేను కాలిపోతున్నా. అన్నదాతా నీ పంట కోసం వేసిన మంట నా పచ్చని బతుకును బుగ్గిపాలు చేసింది. రెమ్మలన్నీ కాలిపో యాయి.. కొమ్మలన్నీ మాడిపోయాయి.. నీవు పెట్టిన ఈ చిచ్చు ప్రకృతి మాత గుండెకు తగిలిన మంట కాదా? నా నీడలో సేద తీరిన పక్షులు ఇళ్లు కోల్పోయాయి. నా నుంచి వచ్చే గాలి కలుషితమైపోయింది. రేపు నేను లేకపోతే నీ పిల్లలకు నీడ ఎక్కడిది? ఊపిరి ఎక్కడిది?

Advertisement
 
Advertisement
Advertisement