శాంతి భద్రతలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలపై దృష్టి సారించాలి

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

నిజామాబాద్‌అర్బన్‌: బక్రీద్‌ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. బుధవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ బక్రీద్‌ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్‌ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ప్రార్థన స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్‌ ప్రాంతాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పండుగ రోజు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్‌ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. శాంతి కమిటీ సభ్యులతో ముందస్తు సమావేశాలు నిర్వహించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్‌, సీసీ కెమెరాలు పర్యవేక్షణలో భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. అన్ని చెక్‌పోస్టులలో 24 గంటలు విధులు నిర్వహించాలన్నారు. రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాటాపూర్‌ వద్ద జరిగే పశువుల సంతలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాష్‌, అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కిరణ్‌కుమార్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బోధన్‌ ఏసీపీలు ప్రకాశ్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, మస్తాన్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

వీసీలో పాల్గొన్న సీపీ సాయిచైతన్య, ఇతర పోలీసు అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement