● సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: పండుగ సమయాల్లో ఎలాంటి అపోహలు నమ్మొద్దని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో సోమవారం తన కార్యాలయంలో మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు, ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో సోమవారం ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో 7,294 మంది విద్యార్థులకు 6,902 మంది విద్యార్థులు హాజరుకాగా 392 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కామారెడ్డిలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు తెలిపారు. ఉ దయం జరిగిన నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, ఐ దో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 5,340 మంది విద్యార్థులకు 5,070 మంది హాజరుకాగా 270 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెమిస్టర్ రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 1,954 మంది విద్యార్థులకు 1,831 మంది హాజరుకాగా 122 మంది గైర్హాజరయ్యారని చంద్రశేఖర్ తెలిపారు.
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా కోర్టు పరిపాలనాధికారిగా ఆర్.గోవింద్ రావును నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పని చేసిన పరిపాలనాధికారి ఎస్.చంద్రమోహన్‌ను నిర్మల్ జిల్లాకు బదిలీ చేశారు. నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏవోగా ఉన్న గోవింద్ రావు స్థానంలో ఎల్‌బీ నగర్ నుంచి నరేందర్ బదిలీపై రానున్నారు. మహిళా కోర్టు ఏవోను మేడ్చల్ మల్కాజిగిరికి బదిలీ చేయగా, ఆ స్థానంలో కామారెడ్డి ఏవో మంత్యనాయక్ రానున్నారు.
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావు
సుభాష్‌నగర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు, ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు స్విచ్‌లు, ప్లగ్‌లు, ఎలక్ట్రికల్ పరికరాలు ముట్టుకోవద్దని తెలిపారు. నేలపై తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాలు తాకొద్దని, వెంటనే సమీపంలోని విద్యుత్ సిబ్బందికి, 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ఇంట్లో లీకేజీ కరెంట్ రాకుండా ఎర్తింగ్, ఈఎల్‌ఈబీ, ఎంసీబీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు పొలాల్లో మోటార్లకు కేబుల్ జాయింట్లు లేకుండా, సరైన స్టార్టర్లు వాడాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను పశువులను కట్టడానికి ఉపయోగించవద్దని పేర్కొన్నారు.


