నేడు గులాబీ సంబురం! | - | Sakshi
Sakshi News home page

నేడు గులాబీ సంబురం!

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

గులాజీ జెండాలు..

ఆవిర్భావ దినోత్సవాన్ని

జరుపుకోనున్న బీఆర్‌ఎస్‌

ఊరూరా జెండావిష్కరణకు ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడుపోసుకు న్న బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి పాతికేళ్లవుతోంది. 2001 ఏప్రిల్‌ 27న ఆ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ తొలినాళ్లలోనే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలతో చరిత్ర సృష్టించింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డిలో విజయం సాధించింది. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో జ రిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో తొమ్మిది ఎమ్మెల్యే స్థానా లకు గాను అన్నింటిని ఆ పార్టీ గెలుచుకుంది. నిజామాబాద్‌, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల్లోనూ ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచి తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా అన్నిచోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. రెండు పర్యాయాలు అంటే పదేళ్లపాటు గులాబీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు తండాలను పంచాయతీలుగా చేయడం ద్వారా పాలనను కేసీఆర్‌ ప్రజల చెంతకు తీసుకువెళ్లారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా పార్టీ అధినేత కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్‌, నిజామాబాద్‌ ఎంపీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారు. బాన్సువాడ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్‌ గూటికి చేరారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు సైతం గులాబీ పార్టీకి దూరమయ్యారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊరూరా గులాబీ జెండాలు ఆవిష్కరించాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అధికారం కోల్పోయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement