సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కందకుర్తి గ్రామానికి సంబంధించి వివిధ రకాల అభివృద్ధి పనులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గోదావరి నది మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టే చోటు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న ఈ గ్రామం వద్దే మంజీర, హారిద్ర నదులు కలుస్తున్నాయి. త్రివేణి సంగమమైన ఈ గ్రామంలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగనున్నా యి. ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ స్ఫూర్తి మందిరం నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో ఇక్కడ పుష్కర ఘాట్ల అభివృద్ధితోపాటు రోడ్ల కనెక్టివిటీని పెంచేందుకు ఎంపీ అర్వింద్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఎంపీ అర్వింద్ నిధుల కోసం ప్రయత్నాలు చేయడంతో ఫలితం లభించింది.
గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో కందకుర్తిలో వీఐపీ ఘాట్‌ల నిర్మాణం కోసం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో అవసరమైన నిర్మాణాల కోసం ఎంపీ అర్వింద్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పుష్కరా ల సమయంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కందకుర్తి ప్రాంతానికి పర్యాటక ప్రాధాన్యత పెంచేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు సరిహద్దులో ని మహారాష్ట్రలో ఉన్న జాతీయ రహదారి నుంచి కందకుర్తిలోని డాక్టర్జీ స్మృతి మందిరానికి అనుసంధానం అయ్యేలా రహదారిని నిర్మించే విషయంలో ఎంపీ కీలక పాత్ర పోషించారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం కానుంది. పనుల విషయమై సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షలు చేస్తున్నారు. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చే నవీపేట–కందకుర్తి ప్రధాన రహదారి మరమ్మతులకు సైతం నిధులు మంజూరు చేయించారు.
● కందకుర్తిలో నిర్మించిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభానికి ఈ నెల 11న మోహన్ భగవత్ రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత పెరుగనుంది. ఈ విషయాలపై ఎంపీ అర్వింద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజకీయపరంగా సిద్ధాంత వైరుద్ధ్యాన్ని పక్కకు పెట్టి మరీ మంత్రి కోమటిరెడ్డి నిధులు కేటాయించడం పట్ల ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అర్వింద్ తెలిపారు.
పుష్కరాలు, డాక్టర్‌జీ స్మృతి మందిర ప్రారంభ నేపథ్యంలో
ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి నిధుల కోసం విజ్ఞప్తి
నేషనల్ హైవేతో స్మృతి మందిరం
రోడ్డు అనుసంధానం
నవీపేట – కందకుర్తి
మార్గంలో మరమ్మతులు


