● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు
● ఉర్దూ విభాగంలో పరిశోధనపై వర్క్‌షాప్
తెయూ(డిచ్‌పల్లి): ప్రస్తుత పరిస్థితులలో నాణ్యమైన పరిశోధనలు అత్యంత ఆవశ్యకమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలను సమన్వయం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు పేర్కొన్నారు. తెయూ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ‘ఉర్దూలో పరిశోధన కళ– ఆధునిక యుగపు అవసరాలు’ అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ను బుధవారం వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పరిశోధన వనరులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వర్క్‌షాప్ కన్వీనర్, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ ఖవి మాట్లాడుతూ పరిశోధన ప్రాథమిక సూత్రాలు, ఆధునిక అవసరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబు, అధ్యాపకులు ముహమ్మద్ మూసా ఖురేషి, గుల్– ఏ–రానా, మోయీద్ జావేద్, ముహమ్మద్ నజీమ్ అలీ, వర్సిటీ పరిధిలోని ఉర్ధూ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


