● మందర్నా, హున్సా, ఖాజాపూర్‌లో వేలాది ఎకరాల్లో పంట నష్టం
● దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారులు
బోధన్: మంజీర నది తీరంలో శనివారం సాయంత్రం వడగళ్ల వాన విధ్వంసం సృష్టించింది. సాలూర మండలం మందర్నా, హున్సా, ఖాజాపూర్ గ్రామాల శివారులో భారీ ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి చేతికందిన వేలాది ఎకరాల వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి పంట 75 శాతం పైగా గింజరాలి పూర్తిగా నష్టం వాటిల్లింది. మామిడి కాయ నేలరాలగా, అరటి కొమ్మలు విరిగిపోయాయి. భారీ ఈదురుగాలులకు పంట పొలాలు, రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. కాగా, సాలూర మండలం మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర గ్రామాల శివారులో పంట నష్టం ప్రాథమిక అంచనాలను మండల వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. హున్సా శివారులో ఏఈవోలు, రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను ఏవో శ్వేత పరిశీలించారు. నాలుగు గ్రామాల్లో వరి పంట 1,650, మొక్కజొన్న 820, అరటి 49, మామిడి పంట 58 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ఏవో తెలిపారు.


