ఇంటి పన్ను @ 98.09 శాతం | - | Sakshi
Sakshi News home page

ఇంటి పన్ను @ 98.09 శాతం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

రూ.30.03 కోట్లకు

రూ.29.46 కోట్లు వసూలు

262 గ్రామాల్లో వందశాతం పూర్తి

సుభాష్‌నగర్‌: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 2025–26వ ఆర్థిక సంవత్సరానికి ఇంటి, కుళాయిల పన్నుల వసూళ్లలో పంచాయతీ అధికారులు లక్ష్యానికి చేరువయ్యారు. ఏకంగా 98.09 శాతం వసూలు చేసి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపారు. మార్చి నెలలో డీపీవో శ్రీనివాస్‌రావు డీఎల్‌పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించారు. 100 శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ముందుకుసాగారు.

45 శాతం గ్రామాల్లో వంద శాతం

జిల్లా వ్యాప్తంగా 262 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేశారు. అంటే దాదాపు 45 శాతానికిపైనే గ్రామాల్లో వంద శాతం చెల్లింపులు పూర్తయ్యాయి. పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉన్న మండలాలు, గ్రామాలపై నిత్యం పర్యవేక్షణ చేపట్టారు. వసూళ్లలో మందకొడిగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూలు చేపట్టారు. దీంతో కొంతమేర సత్ఫలితాలు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు కృషి చేయాలని డీపీవో శ్రీనివాస్‌రావు తెలిపారు. కాగా, వందశాతం పన్నులు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మిగిలింది రూ.57.27 లక్షలే..

జిల్లాలోని 31 మండలాల్లో 545 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం రూ.30.03 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మార్చి 31వ తేదీలోపు వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ నుంచి నిత్యం సమావేశాల ద్వారా ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.29.46 కోట్లు (98.09 శాతం) వసూలు చేశారు. కేవలం రూ.57.27 లక్షల వరకు వసూలు కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement