● విద్యుత్ సంస్థకు
రూ.1.20 కోట్లకుపైగా నష్టం!
సుభాష్‌నగర్: గాలివాన బీభత్సానికి జిల్లాలోని పలు చోట్ల 220 కేవీ టవర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యు త్ స్తంభాలు నేలకొరిగాయి. డిచ్‌పల్లి మండలం యానంపల్లి, సుద్దాపల్లి, లింగ సముద్రం గ్రామాల శివార్లలో ఉన్న నాలుగు 220 కేవీ విద్యుత్ టవర్లు నేలకొరిగాయి. భారీ గాలులకు 10కిపైగా ట్రాన్స్‌ఫార్మర్లు, 200 వరకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. యానంపల్లిలోని 400 కేవీ సబ్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 220 కేవీ టవర్లు నేలకొరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బోధన్, సాలూర, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. గాలివాన సృష్టించిన బీభత్సంతో ట్రాన్స్ కో, డిస్కమ్‌కు కలిపి రూ.1.20 కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
రాత్రంతా శ్రమించి.. విద్యుత్ అందించి..
గాలి వాన బీభత్సం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు రాత్రి 11.30 గంటల నుంచే రంగంలోకి దిగారు. అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఒకటి, రెండు గ్రామాలు మినహా అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు శ్రమించి విద్యుత్ సరఫరా చేశారు. తెలంగాణ యూనివర్సిటీ, లింగసముద్రం గ్రామాలకు ఆదివారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌ను పునరుద్ధరించారు.
పరిశీలించిన ఎస్‌ఈ
యానంపల్లి 400కేవీ సబ్‌స్టేషన్ సమీపంలో నేలకొరిగిన 220 కేవీ విద్యుత్ టవర్లను ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. ఏడీఈలు, ఏఈలు, లైన్‌మెన్ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఈ హరిచంద్, ట్రాన్స్ కో సీఈ పాపారావు, ట్రాన్స్ కో ఎస్‌ఈ బీఎస్ రావు ఉన్నారు.


