సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని గడ్డిమందు తాగిన యువకుడు | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని గడ్డిమందు తాగిన యువకుడు

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

చికిత్స పొందుతూ మృతి

వేల్పూర్‌(బాల్కొండ): సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మెండోరా మండలం సోన్‌పేట్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోన్‌పేట్‌ గ్రామానికి చెందిన పిండి మధు(19) తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మార్చి 30న గడ్డిమందు తాగాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మధు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.

నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం 9.45 గంటలకు పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా ఎంపీ అర్వింద్‌ ధర్మపురి, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, పసుపు బోర్డు జాతీయ చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని లక్ష్మీనారాయణ కోరారు.

నేడు, రేపు కలెక్టరేట్‌లో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌

సుభాష్‌నగర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలోభాగంగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని సమీకృత కలెక్టరేట్‌లో 6, 7 తేదీల్లో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, నోటి క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, ఇతర క్యాన్సర్ల నిర్ధారణ, క్షయ వ్యాధి స్క్రీనింగ్‌, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఎన్‌ఐసీ రూం, ఎన్‌ఐసీ వీసీ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా, ఆరోగ్య సేవలను వినియోగించుకునేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. స్క్రీనింగ్‌కు హాజరయ్యేవారు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు తీసుకురావాలని ఆమె సూచించారు.

పీఏసీఎస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడిగా షేక్‌ బాబా

బోధన్‌రూరల్‌: ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం (పీఏసీఎస్‌) యూనియన్‌ జిల్లా అధ్యక్షుడిగా బోధన్‌ మండలంలోని పెంటాకాలన్‌ సొసైటీ సీఈవో షేక్‌ బాబా ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో పీఏసీఎస్‌ సీఈవో సమావేశం నిర్వహించి అధ్యక్షుడిగా షేక్‌ బాబా, ప్రధాన కార్యదర్శిగా మోహిద్‌ పాషా, టెజ్రరర్‌గా వంశీకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా షేక్‌ బాబా మాట్లాడుతూ పీఏసీఎస్‌ యూనియన్‌ బలోపేతానికి, సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన యూనియన్‌ సభ్యులకు, సీనియర్లకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement