రైతు కష్టంపై రాళ్లు | - | Sakshi
Sakshi News home page

రైతు కష్టంపై రాళ్లు

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన

సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి,

సాలూర మండలాల్లో తీవ్ర ప్రభావం

భారీగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు

జిల్లా వ్యాప్తంగా 6,088 ఎకరాల్లో పంటనష్టం

రైతు కష్టంపై రాళ్లు పడ్డాయి. పచ్చగా అలరారుతూ ఎన్నో ఆశలు రేకెత్తించిన పంట వడగండ్ల దెబ్బకు నేలవాలింది. పంట చేతికొచ్చిన సమయంలో తమకు ఇదేం పరిస్థితి అంటూ రైతులు గుండెలు బాదుకుంటున్నారు. శనివారం రాత్రి కురిసిన వడగండ్లు బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో బీభత్సం సృష్టించాయి. వరి, మొక్కజొన్న పంటలతోపాటు అరటితోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి, లింగసముద్రం, యానంపల్లి శివారులో హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. సుమారు ఆరు రోజుల వ్యవధిలోనే వడగండ్లు రెండుసార్లు రైతులను దెబ్బకొట్టాయి. ఇప్పటి వరకు సుమారు 9 వేల ఎకరాల విస్తీర్ణంలో 4వేల మందికిపైగా రైతులు పంటలను నష్టపోయారు. అధికారులు పంట నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపారు.

– డిచ్‌పల్లి/బోధన్‌/ధర్పల్లి/సిరికొండ

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో శనివారం కురిసిన వడగండ్ల (రాళ్ల వాన) వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈదురు గాలులకు రాళ్లవాన తోడు కావడంతో వరి గింజలు పొలాల్లోనే నేలరాలాయి. మొక్కజొన్న చేనులోనే వాలిపోయింది. మామిడి కాయలు రాలిపోగా, అరటి చెట్లు దెబ్బతిన్నాయి.

సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి, సాలూర మండలాల్లో అధికంగా పంటలకు నష్టం వాటిల్లగా.. జిల్లాలోని 22 గ్రామాల్లో 6,088 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించింది. కాగా 3,985మంది రైతులు తమ పంటలను నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా 5,065 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లి రైతులను పూర్తిగా దెబ్బతీసింది. మొక్కజొన్న 826, మామిడి 138, అరటి, కూరగాయలు 10 ఎకరాల్లో నష్టపోయాయి. అలాగే కోతకోసి కల్లాల్లో ఆరబోసిన వడ్లు, మక్కలు తడిసిపోయాయి. బాధిత రైతులు లబోదిబోముంటున్నారు. ఇటు జిల్లాకు వర్షసూచన ఉండడంతో రైతులు ముందస్తు కోతలకు వెళ్తున్నారు. మార్చి 31న కురిసిన అకాల వర్షానికి 2,559 ఎకరాల్లో జరిగిన పంట నష్టాన్ని మరువపోకముందే శనివారం వడగళ్ల బీభత్సంతో పంట నష్టం మరింత రెట్టింపు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement