నేలకూలిన చెట్లు.. స్తంభాలు | - | Sakshi
Sakshi News home page

నేలకూలిన చెట్లు.. స్తంభాలు

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

20 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది..

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో కురిసిన వడగళ్ల వర్షం కారణంగా డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో 3,238 ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి ధాన్యం గింజలు నేలరాలిపోయాయి. పొలాల వద్దకు వెళ్లిన రైతులు రాలిపోయిన వడ్ల గింజలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సుమారు రూ.10 కోట్ల వరకు నష్టం కలిగినట్లు ప్రాథమిక అంచనా. భారీ ఈదురు గాలుల కారణంగా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి, లింగసముద్రం, యానంపల్లి శివారులో హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్థంబాలు నేలకూలాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మామిడి కాయలు రాలిపోయాయి. స్తంబాలు నేలకూలడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎన్‌పీడీసీఎల్‌, ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది అర్ధరాత్రి రంగంలోకి దిగి తెల్లవారుఝాము వరకు తీవ్రంగా శ్రమించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికంది వచ్చే సమయంలో నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇందల్వాయి మండలంలో రోడ్లపై ఆరబోసిన వడ్లు వర్షంలో తడిసిపోయాయి.

నాకు సొంతంగా ఉన్న నాలుగెకరాలతో పాటు 16ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 20 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. వరి ధాన్యం గింజలు మొత్తం నేలరాలిపోయి, గడ్డి మాత్రమే మిగిలింది. పశువుల మేతకు తప్ప దేనికి పనికిరాదు. సుమారు రూ.10 లక్షల నష్టపోయాను.

–పానుగంటి లక్ష్మణ్‌రెడ్డి, రైతు, సుద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement