సుభాష్‌నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు ఇక బహిరంగ వేలం పద్ధతిలోనే కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా మార్కెట్లలో తీసుకొచ్చిన ఈ–నామ్ 2.0లో సాంకేతిక లోపాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ–నామ్ 1.0ను అప్‌డేట్ చేయకుండా సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మార్చడం, 2.0పై మార్కెట్ సిబ్బంది శిక్షణ ఇవ్వకపోవడం, ముఖ్యంగా నిజామాబాద్ వంటి పెద్ద మార్కెట్లలో పసుపు సీజన్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. లాట్ నంబర్లు ఇవ్వడంలో జాప్యం కారణంగా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. తద్వారా పసుపు రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఇక నుంచి నిజామాబాద్ మార్కెట్‌యార్డులో బహిరంగ వేలం పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాంకేతిక లోపాలు
శ్రద్ధానంద్ గంజ్‌లో ఈ–నామ్ 2.0ను అమలు చేయాలని ఢిల్లీ నుంచి ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులు వచ్చారు. గతంలో తలెత్తిన సాంకేతిక లోపాలను మార్కెట్ కమిటీ ఉద్యోగులు వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు వాటిని నోట్ చేసుకుని సరి చేస్తామని చెప్పారు.ఈ క్రమంలోనే మార్చి 31న ఈ–నామ్ 2.0 అమలు చేయాలని మార్కెట్ కమిటీకి ఆదేశాలు అందాయి. దీంతో చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అధికారులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమై.. రైతుల వివరాలు సేకరించి కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. 3వ తేదీన 30వేల బస్తాలు (సుమారు 5వేల లాట్స్) వచ్చాయి. మధ్యాహ్నమైనా సాంకేతిక కారణాల వల్ల కేవలం 1435 లాట్‌నంబర్లు మాత్రమే జారీ చేశారు. జారీ చేసిన లాట్ నంబర్లకు బ్రిడ్ క్రియేషన్‌లోనూ లోపాలు తలెత్తాయి. ఈ ప్రక్రియతో వ్యాపార లావాదేవీల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని గ్రహించి బహిరంగ వేలం చేపట్టారు. ఢిల్లీ నుంచి కంపెనీ ప్రతినిధులు వచ్చినా సాంకేతిక లోపాలు కొలిక్కి రాలేదు.
లోపాలు అధిగమించే వరకూ..
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈ–నామ్ 2.0లో సాంకేతిక లోపాలు అధిగమించే వరకూ బహిరంగ వేలం పద్ధతిలోనే పసుపు కొనుగోళ్లు చేపట్టనున్నారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత మార్కెట్‌లో మళ్లీ ఓపెన్ ఆక్షన్ వైపు అడుగులు పడుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తే వ్యాపార లావాదేవీల్లో తీవ్ర జాప్యం జరిగి రైతులు రోజుల తరబడి మార్కెట్లలో ఉండాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లు చేపడితే నష్టపోతామని మరికొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ మార్కెట్‌లో అటు రైతులు.. ఇటు అధికారుల్లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
కత్తి మీద సాము..
జిల్లాకేంద్రంలోని గంజ్‌లో ఈయేడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ–నామ్ 2.0ను అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. పసుపు సీజన్‌లో సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మార్చేసి అమలు చేయడమంటే ఉద్యోగులు, సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. ఉద్యోగులు, సిబ్బంది పూర్తిగా 2.0 అమలుపైనే దృష్టి సారించారు. అయినప్పటికీ కొలిక్కి రాలేదు. రెండు రోజులైనా పసుపు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఎంపీ అర్వింద్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి తాత్కాలికంగా 1.0లోనే కొనుగోళ్లకు అనుమతులు తీసుకుని కొనసాగించారు.
బహిరంగ వేలం ద్వారానే కొనుగోళ్లు
మార్కెట్‌యార్డుకు భారీ ఎత్తును పసుపు వస్తోంది. ఈ సమయంలో ఈ–నామ్ 2.0 అమలు కష్టతరంగా మారింది. వ్యాపార లావాదేవీల్లో తీ వ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నా.. సాంకేతిక లోపాలను అధిగమించలేకపోతున్నాం. రైతు సోదరులు అసౌకర్యానికి గురవుతున్నారు. వ్యాపారులు, రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు ఈ–నామ్ 2.0 సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేవరకూ మార్కెట్ కమిటీలో బహిరంగ వేలం ద్వారానే కొనుగోళ్లు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చాం.
– ముప్ప గంగారెడ్డి,
మార్కెట్ కమిటీ చైర్మన్, నిజామాబాద్
పసుపు కొనుగోళ్లకు పాతపద్ధతి
ఈ–నామ్ 2.0లో తరచూ
సాంకేతిక సమస్యలు
ఢిల్లీ ప్రతినిధులు వచ్చినా..
కొలిక్కి రాని లోపాలు
1.0ను పూర్తిగా నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం
నిజామాబాద్ మార్కెట్ యార్డులో
రైతులకు తప్పని తిప్పలు


