● వరి, మొక్కజొన్న, అరటి,
కూరగాయల పంటలకు తీవ్ర నష్టం
● ఈదురు గాలులు, ఉరుములు,
మెరుపులతో భీతావహ వాతావరణం
బోధన్: బోధన్ రెవెన్యూ డివిజన్‌లోని మంజీర నది తీరంలో సాలూర మండల కేంద్రం, ఖాజా పూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ నాలుగు గ్రామాల్లో యాసంగి సీజన్‌లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. పంటలు కోత దశకు చేరాయి. సాలూరలో వరి కోతలు ప్రారంభం కాగా ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. హున్సా గ్రామ రైతులు వంద ఎకరాలకు పైగా అరటి సాగు చేశారు. వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు అకాల వర్షం వల్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు సేవా కేంద్రం ఆవరణలో, అంతర్రాష్ట్ర బైపాస్ రోడ్డు మార్గం, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వర్షం నుంచి రక్షణకు ఆరబెట్టిన ధాన్యంపై పాలిథిన్ కవర్‌లు కప్పుతూ రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు మొక్కజొన్న నేలవాలింది. వరి పంటకు గింజ రాలిపోయింది.
నాడు వరదలు..
మంజీర తీర గ్రామాలను ప్రకృతి వైపరీత్యాలు ప్రతిసారి వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో మంజీర నదికి భారీ వరద పోటెత్తి మందర్నా, హున్నా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి గ్రామాల శివారులో కోత దశకు చేరిన సోయా, వరి, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులకు తీరని నష్టం కలిగింది. వరద దెబ్బ నుంచి క్రమంగా కోలుకుని, యాసంగి సీజన్ పంటలు సాగు చేసి కొండంత ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రస్తుతం అకాల వర్షం దెబ్బ పడింది.
శనివారం రాత్రి సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షం కురిసింది. మరో నాలుగు రోజులు భారీ ఈదురు గాలులు, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.
సాలూర శివారులో నేలకొరిగిన వరిని చూపుతున్న రైతు దార్మె శంకర్


