జిల్లాలో నెలకు మీటరు చొప్పున తగ్గుతున్న భూగర్భ జలాలు
● మార్చిలో నీటి మట్టం 11.67 మీటర్లు
● అయినా గత ఏడాదితో పోలిస్తే బెటరే!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో నెలకు మీటరు చొప్పున కిందికి వెళ్లగా.. ప్రస్తుతం 11.67 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలతో (13.45మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి. ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులు జిల్లాలో 82 పరిశీలక బోరు బావుల (ఫీజో మీటర్లు) ద్వారా జనవరి నెలకు సంబంధించిన నీటి లెక్కలను తీశారు. ఇందులో 36 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 36 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా 10 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యకర నీటి మట్టాలు 56శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. భీమ్‌గల్, సిరికొండ, డిచ్‌పల్లి, మోపాల్, నవీపేట్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మోటార్లకు నీరందక బోర్లు ఎత్తిపోతున్నాయి. ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలని, రానున్న రోజు ల్లో నీటి ఎద్దటి రాకుండా వృథా నీరు భూమిలోకి చేరేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జిల్లా భూగర్భజల శాఖ అధికారి శ్రీనివాస్‌బాబు కోరారు.
నెలల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో..)


