ఆర్మూర్/ఖలీల్‌వాడి : జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టర్ శనివారం జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్, ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించారు. బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్‌లో పలు లోపాలను గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. తక్షణమే స్కూల్‌ను సందర్శించి లోపాలను చక్కదిద్దాలని సూచించారు. విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చుండి పరీక్షలు రాస్తున్నారని, మరో ఐదు అదనపు గదులను పరీక్షల నిర్వహణ కోసం వినియోగించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు సత్యకుమారి, ఎస్.వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు.
46 మంది గైర్హాజరు
పదో తరగతి వార్షిక పరీక్షలకు 46 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్‌కుమార్ శనివారం తెలిపారు. శనివారం నిర్వహించిన గణితం పరీక్షకు 24,390 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. కలెక్టర్ రెండు, డీఈవో ఆరు, ఫ్లయింగ్ స్క్వాడ్ 37, ఏసీజీ ఈ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, ఆర్మూర్‌లో
పరీక్ష కేంద్రాల తనిఖీ
సీఎస్‌కు షోకాజ్ నోటీసులివ్వాలని
డీఈవోకు ఆదేశం


