● టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్
● వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఖిల్లా రామాలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఖిల్లా రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేడుకల్లో మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, రమేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతంరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. రూ.1కోటితో ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం, రూ.50లక్షల నిధులతో ఆలయం వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఆలయం పరిధిలోని దాదాపు 65 ఎకరాల దేవుడి మాణ్యం భూమిని ఆలయానికి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సుభాష్‌నగర్‌లో ఉన్న రామాలయంను ఆయన సతీసమేతంగా దర్శించుకొని, పూజలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సరళ మహేంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభ నవీన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు అందజేసిన కవిత దంపతులు
నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఖిల్లా రామాలయం (రఘునాథ ఆలయం)లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత–దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు వారు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి, పూజలు నిర్వహించారు.


