మోపాల్: మండలంలోని సిర్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై నాగభూషణం తెలిపారు. వివరాలు ఇలా.. సిర్‌పూర్ గ్రామానికి చెందిన పార్వతి లక్ష్మణ్ (68) రెండు నెలలుగా ఛాతి నొప్పి, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. భార్య లేనికారణంగా కొన్నిరోజులుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. అనారోగ్య కారణాలు, ఒంటరి జీవితంతో అతడు జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.
ఎల్లారెడ్డి: పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అన్నారం యాదగిరి(53) భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటినుంచి అతడు మద్యానికి బానిసయ్యాడు. గురువారం యాదగిరి మద్యం తాగి ఇంటికి వచ్చి, డబ్బులు కావాలని కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. దీంతో ఆయనను ఇద్దరు కుమారులు మందలించడంతో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్దకుమారుడు మణికంఠచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
నిజామాబాద్ అర్బన్: నగర శివారులోని సారంగాపూర్ ప్రధాన రోడ్డులోగల పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై వెంకట్‌రావు శుక్రవారం తెలిపారు. బంక్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి, విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించగా, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ బైక్ చోరీకి గురైనట్లు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. సాయిప్రసాద్ అనే వ్యక్తి శుక్రవారం తన బైక్‌ను రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్‌చేసి స్టేషన్‌లోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదన్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


