నవీపేట: ఆధునిక కంప్యూటర్ యుగంలో సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు. నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను తెలుసుకున్నారు. కళాశాల వెనుక ప్రాంతంలో రూ.కోట్ల వ్యయంతో నిర్మించినప్పటికీ వృథాగా ఉన్న హాస్టల్ భవనాన్ని సందర్శించి, వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. నవీపేటలోని కళాశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, వచ్చే ఏడాది అదనంగా రొబొటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లను అందిస్తామని పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు మంజూరైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని, కల్తీ చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.
నీటి ఎద్దడి తలెత్తకుండా
ముందస్తు చర్యలు
కల్తీ పదార్థాల తయారీపై నిఘా
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
కలెక్టర్‌తో కలిసి నవీపేట పాలిటెక్నిక్
కళాశాల తనిఖీ


