తీరు మార్చుకోకపోతే సస్పెన్షన్లకు వెనుకాడబోం | - | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోకపోతే సస్పెన్షన్లకు వెనుకాడబోం

Mar 26 2026 7:25 AM | Updated on Mar 26 2026 7:25 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ఎస్‌ఐఆర్‌పై శిక్షణకు గైర్హాజరైన

బీఎల్‌వోలపై ఆగ్రహం

నిజామాబాద్‌ అర్బన్‌: తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు సైతం వెనుకాడేది లేదని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి బీఎల్‌వోలకు హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)పై నిర్వహించిన శిక్షణకు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)పై బూత్‌ లెవెల్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, పలువురు బీఎల్‌వోలు శిక్షణకు హాజరుకాకపోవడాన్ని గమనించిన కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియలో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందన్నారు. బీఎల్‌వోలు శిక్షణకు గైర్హాజరైతే మీరేం చేస్తున్నారంటూ సూపర్‌వైజర్‌లపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం బీఎల్‌వోలు నిర్వర్తించాల్సిన విధులు, ఎస్‌ఐఆర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాలపై మాస్టర్‌ ట్రైనర్లు జ్ఞానేశ్వర్‌, సంతోష్‌ కుమార్‌ అవగాహన కల్పించారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌ రవీంద్ర సాగర్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సౌత్‌, నార్త్‌ తహసీల్దార్లు శ్రీధర్‌, విజయ్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీవోలు, హౌసింగ్‌ ఏఈలతో కలెక్టర్‌ సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల తర్వాత మళ్లీ తాను సమీక్ష చేస్తానని, తప్పనిసరిగా పురోగతి కనిపించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, హౌసింగ్‌ ఇంచార్జి పీడీ గంగాధర్‌, ఈఈ నివర్తి, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్‌ ఏఈలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement