నిజామాబాద్ అర్బన్: వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలను పురమాయిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య, ఉపాధిహామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, తన నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని సైతం ఏర్పా టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ నివా రణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీని ఆదేశించారు.
ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు ఇవీ..
● ప్రజలు, కార్మికులు భారీ ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులకులోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
● లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలి.
● బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో రెట్టింపు స్థాయిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను నిల్వ చేయాలి.
● ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ సెంటర్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండాలి.
● గురుకులాలు, వసతిగృహాల్లో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలి.
● ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్ర జలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా చూడాలి. అత్యవసర సమయంలో బయటికి వచ్చే వారికి జాగ్రత్తు తీసుకునేలా అవగా హన కల్పించాలి.
● ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి.
● ప్రధానంగా వ్యవసాయ, ఉపాధి కూలీలు, వివిధ పరిశ్రమలలో పని చేసే వారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులకు తగి న సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలి.
● ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయాలి. కూలీలు తమ వెంబడి తాగునీరు తెచ్చుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
వడదెబ్బ బారిన పడకుండా
ప్రజలను అప్రమత్తం చేయాలి
జాగ్రత్తలను వివరిస్తూ
కరపత్రాలను పంచండి
ఉత్తర్వులు జారీ చేసిన
కలెక్టర్ ఇలా త్రిపాఠి


