డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంతోపాటు రికవరీ చేయడంలో నిజామాబాద్ జిల్లా టాప్‌లో నిలిచింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో సాయాగౌడ్‌ను ప్రశంసించిన రాష్ట్ర సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. వార్షిక టార్గెట్ రూ.1,228కోట్ల పంపిణీని దాటి అదనంగా రూ.109 కోట్లు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. మిగతా జిల్లాలు నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఏర్గట్ల, మాక్లూర్, ఎడపల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, కమ్మర్‌పల్లి, నందిపేట్, రెంజల్, వేల్పూర్, సిరికొండ, ముప్కాల్, మోపాల్, నవీపేట్, డిచ్‌పల్లి, మోర్తాడ్, వర్ని, భీమ్‌గల్, బాల్కొండ మండలాలు రుణాల పంపిణీలో వంద శాతాన్ని చేరుకున్నాయి.
ఆర్థిక సంవత్సరం ముగియక ముందే..
2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,228 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను 19,969 మహిళా సంఘాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం (మార్చి) ముగింపునకు వారం రోజులు ఉండగానే టార్గెట్‌ను దాటి రూ.1,332 కోట్ల రుణాలను 16వేల సంఘాల వరకు అందజేసి రాష్ట్రస్థాయిలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. బ్యాంకుల సహకారంతో ఐకేపీ అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి సంఘానికి రుణాలివ్వడంతో టార్గెట్‌ను సులభంగా సాధించారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను పాడి పరిశ్రమ, చిన్న తరహా వ్యాపారాలు, కుట్టు మిషన్లు, ఇతర కుటీర పరిశ్రమల స్థాపనకు ఉపయోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అలాగే తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారు. తద్వారా జిల్లాలో రికవరీ శాతం మెరుగ్గా ఉంది. ఈనాటికి జిల్లా వ్యాప్తంగా 0.38 శాతం మాత్రమే బకాయిలు ఉండడం విశేషం. కాగా ఇది రికార్డు స్థాయి అని చెప్పొచ్చు.
ప్రణాళికతోనే సాధ్యమైంది...
ఐకేపీ అధికారులు, సిబ్బంది కలిసి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వడం, ఎన్‌పీఏ బకాయిలు లేకపోవడం సంతోషంగా ఉంది. ఇదే స్పూర్తితో మున్ముందు కూడా లక్ష్యాలను దాటి రుణాలు అందజేస్తాం.
– సాయాగౌడ్, డీఆర్‌డీవో, నిజామాబాద్
పంపిణీ.. రికవరీలో నిజామాబాద్ భేష్
వార్షిక లక్ష్యానికి మించి మహిళా సంఘాలకు రుణాలిచ్చిన అధికారులు
డీఆర్డీవోను ప్రశంసించిన
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్


