● రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు
● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
సుభాష్‌నగర్: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, ఐకేపీ సీసీలు, మెప్మా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో యాసంగిలో 4.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారన్నారు. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 669 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని, 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని అంచనా వేశామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని, ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


