సుభాష్‌నగర్: రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు రైతుల భావోద్వేగాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్.. కేవలం రూ.12వేలకే పరిమితమైందని విమర్శించారు. రైతు భరోసాను ఇప్పటికే నాలుగు విడతల్లో రైతులకు ఎగ్గొట్టిన విషయాన్ని అన్నదాతలు మర్చిపోరని, సరైన సమయంలోనే కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెడతారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తుంది రైతు సంక్షేమం కాదని, ఇది పక్కా రాజకీయ మోసమన్నారు. ప్రభుత్వం ఇకనైనా పబ్లిసిటీ నాటకాన్ని కట్టి పెట్టి.. రైతుల అవసరాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి డబ్బులను ఒకేసారి జమ చేయాలని, లేకుంటే రైతాంగం పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.


