● మే 10 వరకు దరఖాస్తులకు గడువు
● సెలెక్షన్ లిస్టు మే 30.. జూన్ 5న కౌన్సెలింగ్
● పదో తరగతి పూర్తయిన
విద్యార్థులకు సువర్ణావకాశం
కమ్మర్‌పల్లి: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్టీయూకేటీ) పరిధి బాసర ట్రిపుల్ ఐటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లు స్థానికంగా, 15 శాతం మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు.
జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు..
పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోరును అదనంగా కలుపుతారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు.
ప్రవేశాల షెడ్యూల్
ఈ నెల 18 నుంచి మే 10 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. దివ్యాంగులు, సైనిక ఉద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్,గ్లోబల్ కేటగిరికి చెందినవారికి మే 20 వరకు ద రఖాస్తు చేసుకోవచ్చు. మే 30న ఎంపికై న విద్యార్థుల జాబి తా ప్రకటించి, జూన్ 5న తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
అర్హతలు..
విద్యార్థులు తొలి ప్రయత్నంలో 2026–ఎస్సెస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 31.12.2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ(ఏ) 7, బీసీ(బీ) 10, బీసీ(సీ) 1, బీసీ(డీ) 7, బీసీ(ఈ)లకు 4 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.
దరఖాస్తు ఇలా..
అభ్యర్థులు ఈ సేవ, మీ సేవ, టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీలకు రూ. 450, వేరే రాష్ట్రాల వారు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు దరఖాస్తు చేసుకుంటే చివరగా చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యో గుల పిల్లలకు 2, ఎన్‌సీసీలో ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.
జత చేయాల్సిన పత్రాలు..
దరఖాస్తు రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికో ద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
ఫీజులు ఇలా..
రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్య బీమా, ఇతరాలకు సంబంధించి రూ. 3,500 ఇతరులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,000 చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా రూ. 2,000 చెల్లించాలి. ఎంపికై న విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతోపాటు రెండు జతల యూనిఫాం, షూ, ల్యాప్‌టాప్, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు.


